Romans 12

ఆరవ భాగం. క్రైస్తవ జీవితం, సేవ (రోమా 12:1-15, 33) (1) సమర్పణ, ప్రతిష్ట

1కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. 2మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.

(2) సేవ

3దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి.

4ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. 5అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.

6దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. 7
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Rom 12:8.
In this translation, this verse contains text which in some other translations appears in verses Rom 12:7-Rom 12:8.
8పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

(3) క్రైస్తవులు, సాటి విశ్వాసులు

9మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి. 10సోదర ప్రేమతో ఒకడిపై ఒకడు అభిమానం చూపిస్తూ, గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి.

11ఆసక్తి విషయంలో వెనకబడిపోవద్దు, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. 12ఆశాభావంతో ఎదురు చూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. 13పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథుల్ని శ్రద్ధగా ఆదరించండి.

14మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. 15సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి. 16ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.

(4) క్రైస్తవులు, క్రైస్తవేతరులు

17కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టిలో మేలు జరిగించండి. 18మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండండి.

19ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. “పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.

20“కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.
అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది.”

కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి.

21

Copyright information for TelULB